క్రికెట్ కెనడా బోర్డు అధ్యక్షుడే లక్ష్యంగా కాల్పులు
- క్రికెట్ కెనడా అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన అర్విందర్ ఖోసా
- సర్రేలోని ఆయన నివాసంపై కాల్పులు
- ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించిన పోలీసులు
క్రికెట్ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన అర్విందర్ ఖోసా లక్ష్యంగా కెనడాలో కాల్పులు జరిగాయి. సర్రేలోని ఆయన నివాసమే లక్ష్యంగా తెల్లవారుజామున దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఇంటి డోర్‌కు ఐదు బుల్లెట్లు తగిలినట్లు విచారణలో తేలింది. సమాచారం అందిన వెంటనే ఉదయం 4.40 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్న కెనడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
ఈ దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అర్విందర్ ఖోసాకు, బిష్ణోయ్ ముఠాకు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు రాగా... ఆయన వాటిని పూర్తిగా ఖండించారు. అయితే, క్రికెట్‌లో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలకు సంబంధించి బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఉన్న ఆరోపణలను గత నెలలోనే సీబీసీ ఇన్వెస్టిగేటివ్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. గతేడాది ఓ క్రికెటర్‌ను ఈ ముఠా సభ్యులు బెదిరించినట్లు తేలడం, అలాగే మర్డర్లు, వేధింపులు, కాల్పుల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కెనడా ప్రభుత్వం ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
క్రికెట్ కెనడా బోర్డును లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ బోర్డు ఎగ్జిక్యూటివ్స్‌ను టార్గెట్ చేస్తూ దాడులు జరగ్గా, కాల్గరేలో ఒక బోర్డు సభ్యుడు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు నేరుగా అసోసియేషన్ అధ్యక్షుడి ఇంటిపైనే కాల్పులు జరగడంతో క్రికెట్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన కాల్గరే దాడికి, ప్రస్తుత సర్రే కాల్పుల ఘటనకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో కెనడా పోలీసులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.